‘చట్టం ముందు అందరూ సమానమే.. అన్యాయం చేస్తే చట్టం ముందు మన తన అనే భేదం ఉండదు’. దీన్నే వృత్తి ధర్మంగా నమ్మింది ఈ మహిళ పోలీసు అధికారిణి. వ్యక్తిగత అనుబంధాల కంటే విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యమిచ్చింది. ఈ క్రమంలోనే కాబోయే భర్త ఓ ఫ్రాడ్ అని తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా అతడిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు అందరితో శభాష్ అనిపించుకుంది.
నాగాన్ జిల్లాలో జున్మోని రభా సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో రభాకు రాణా పొగగ్ అనే యువకుడు తనను తాను పౌర సంబంధాల అధికారి(పిఆర్ఓ)గా పరిచయం చేసుకున్నాడు. గత అక్టోబర్‌లో వీరిద్దరికి నిశ్చితార్ధం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే, రాణా పొగాగ్ అనే వ్యక్తి ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలామందిని మోసం చేశాడు. వారి దగ్గర నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేశాడు.
అతడి చేతిలో మోసపోయిన బాధితుల ఫిర్యాదు చేయటంతో విషయం బయటపడింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ఐ జున్మోని రభా.. కాబోయే భర్త రాణా పొగాగ్‌ను గురువారం అరెస్ట్ చేసింది. ఇలా తన కాబోయే భర్త మోసగాడు అని తెలిసి తన చేతికి సంకెళ్లు వేశారని తెలియడంతో ఎంతోమంది ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా జున్మోని మీడియాతో మాట్లాడారు. తను ఓ పెద్ద మోసగాడి బారిన పడకుండా బయటపడినందుకు ఆనందంగా ఉందన్నారు. ‘అతను ఎంత పెద్ద మోసగాడో.. రాణా పొగాగ్ గురించి సమాచారంతో నా దగ్గరకు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కృతజ్ఞతలు చెబుతున్నాను. వారు నా కళ్లు తెరిపించారు’ అని జున్మోని చెప్పారు.
ఈ జనవరిలో జున్మోని రాభా ఎస్సై.. స్థానిక బిహ్‌వురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌పై ఫైర్ అయి అప్పట్లో వార్తలలో నిలిచింది. ఒక కేసు విషయంలో ఎమ్మెల్యే అధికారిణికి కాల్ చేశారు. దీంతో ఆమె ప్రజాప్రతినిధిగా ఉంటూ నిబంధనలను ఉల్లంఘించమని పోలీసులను ఎలా అడుగుతారని ఎమ్మెల్యేను జున్మోని రాభా ప్రశ్నించింది. దీంతో ఆమె పాపులర్ అయ్యింది.