ఈమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ స్వరంలో చాలా మార్పులొచ్చాయి. కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్ లో పంచ్ డైలాగులు విసురుతున్నారు. బీజేపీ నేతలకు సవాళ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో సర్జికల్ స్ట్రయిక్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత శర్మ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ.. సర్జికల్ స్ట్రయిక్స్ ఆధారాలు కేంద్రం బయటపెట్టాలన్న డిమాండ్ లో తప్పేంటని ప్రశ్నించారు. తనది కూడా అదే మాట అని చెప్పారు. దీంతో కేసీఆర్ పై అసోం పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పై పోలీస్ కేసు నమోదైంది.
అసోంలోని బీజేపీ నేతలు కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కేసులు పెడుతున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని అంటున్నారు.
ఇటు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా స్పందించారు. సైన్యం ధైర్యసాహసాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదన్నారు. అలాంటి వారికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదిస్తాడని.. దేశం, సైన్యంపై మంచి ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారని చెప్పారు.