అసోం టీ పొడి మరోసారి రికార్డు సృష్టించింది. దిబ్రూఘడ్ జిల్లాలో పండించిన మనోహరి గోల్డ్ టీ పొడి వేలంలో కిలో రూ.99,999 పలికింది. ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన టీ పొడులను వేలం వేస్తాయి. అందులో హోల్ సేల్లర్ సౌరవ్ టీ ట్రేడర్స్ అత్యధిక బిడ్డింగ్ వేసి దాన్ని సొంతం చేసుకుంది.
గతేడాది మనోహరి గోల్డ్ టీ కిలో రూ.75 వేలు పలకగా.. 2019లో కిలో రూ.50 వేలకు అమ్ముడుపోయింది. ఈ రకం తేయాకును ప్రత్యేకంగా సేకరిస్తారు. మిగతా టీ పొడుల మాదిరిగా దీన్ని ఆకుల నుంచి కాకుండా… మొక్కల నుంచి మొగ్గలను సేకరించి తయారు చేస్తారు. మే-జూన్ నెలలలో తెల్లవారుజామున ఆ మొగ్గలను సేకరిస్తారు. ఇది చాలా కష్టంతో కూడిన ప్రక్రియ అందుకే మనోహరి రకం అంత ధర పలుకుతుంది. అయితే దీని ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది.