రష్యా యుద్ధంతో తల్లడిల్లుతున్న ఉక్రెయిన్ కి అస్సాం లోని వైద్య విద్యార్థులు మళ్ళీ తరలి వెళ్తున్నారు.ఉక్రెయిన్ నుంచి వఛ్చిన వీరు ఇండియాలో తమ మెడిసిన్ కోర్సు కొనసాగించడానికి తగిన వెసులుబాటు లేదని కేంద్రం లోగడ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో ఇండియాలోనే తమ వైద్య విద్యకు అవకాశం ఉంటుందన్న వీరి ఆశలు నీరు గారిపోయాయి. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఉక్రెయిన్ లోని యూనివర్సిటీల్లోనే తిరిగి మెడిసిన్ చదవాలనుకుని ఆ దేశానికి ప్రయాణమవుతున్నారు.
మొదట అస్సాంలోని అనేకమంది అప్పుడే ఆ దేశం చేరారు. మొదటి బ్యాచ్ విద్యార్థుల్లో ఒక స్టూడెంట్.. తమకు అక్టోబరు నుంచి ఇక్కడి యూనివర్సిటీల్లో ప్రాక్టికల్స్ ప్రారంభమవుతాయని, చేసేది లేక తాను గత నెల మూడో వారం లోనే ఉక్రెయిన్ చేరానని తెలిపింది. ఒకప్పుడు వార్ ఉధృతంగా ఉన్నప్పుడు తనలాంటి అమ్మాయిలు బంకర్ లో సుమారు 20 రోజులు ఉన్నామని చెప్పింది.
ఓ వైపు ఈ దేశంలో యుద్ధ భీకర పరిస్థితులు ఉన్నా.. వీరు తమ వైద్య విద్య కొనసాగించేందుకు మళ్ళీ ఈ దేశానికి చేరుకుంటున్నారు. అస్సాంలోని అనేకమంది తలిదండ్రులు కూడా తమ కొడుకులను, కూతుళ్లను విధి లేక ఉక్రెయిన్ కి పంపుతున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ అణు యుద్ధం గురించి హెచ్చరించినా.. వీరు భయంభయంగానే ఈ దేశంలో అడుగు పెట్టారు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన మన దేశ ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా వీరి లాగే మళ్ళీ ఉక్రెయిన్ వెళ్లే సూచనలు ఉన్నాయంటున్నారు.