తమ అధ్యక్షుడు జెలెన్ స్కీ కి వ్యతిరేకంగా జరిగిన హత్య కుట్రను తమ అధికారులు అడ్డుకున్నట్టు ఉక్రెయిన్ భద్రతా, రక్షణ వ్యవహారాల చీఫ్ మంగళవారం తెలిపారు. రష్యా భద్రతా సేవల సభ్యుల నుండి వచ్చిన సమాచారం మేరకు తాము ఆ పని చేయగలిగామని చెప్పారు.
‘మా అధ్యక్షుడు జెలెన్ స్కీని హత్య చేసేందుకు చెచెన్ ప్రత్యేక బలగాల ఎలైట్ గ్రూపు కడిరోవ్ ట్సీను రష్యా పంపింది. ఆ గ్రూపును మా అధికారులు అడ్డుకున్నారు” అని ఉక్రెయిన్ జాతీయ భద్రత, రక్షణ మండలి అధిపతి ఒలెక్సీ డానిలోవ్ చెప్పారు,
‘ మా అధ్యక్షుడిని హతమార్చేందుకు జరుగుతున్న కుట్రల గురించి మాకు తెలిసింది. ఈ కుట్రలో పాల్గొనడానికి ఇష్టపడని కొందరు రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ప్రతినిధులు మాకు సమాచారం అందించారు” అని ఆయన తెలిపారు.
‘ ఈ సమాచారం అందించిన ఫెడరల్ సెక్యూరిటీ సభ్యులకు మా ధన్యవాదాలు. వారి సమాచారంతో మా అధ్యక్షున్ని హత మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఎలైట్ గ్రూపును మేము మట్టుపెట్టాము” వెల్లడించారు.