హైదరాబాద్ నగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేర నియంత్రణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. యువకుల మధ్య నెలకొన్న చిన్న విభేదాలు.. కత్తులతో దాడి చేసుకునే వరకు దారితీస్తున్నాయి. నగరంలో ఆదివారం రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులపై కత్తులతో దాడులు జరిగాయి.
సికింద్రాబాద్.. బేగంపేట పీఎస్ పరిధిలో ఆదివారం తెల్లవారు జామున కత్తిపోట్ల కలకలం రేగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఇలాహి మజీద్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిపై.. మరో యువకుడు అతని స్నేహితులతో కలిసి కత్తులతో దాడికి పాల్పడ్డాడు. కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఘటనపై సమాచారం అందుకున్న బేగంపేట్ పోలీసులు.. యువకుడిపై హత్యకు యత్నించిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. ఘటనకు సంబందించిన వివరాలను సేకరిస్తున్నట్టు వెల్లడించారు.
ఇక.. సికింద్రబాద్ లోని చిలకలగూడ పీఎస్ పరిధిలోనూ కత్తుల దాడి జరిగింది. చిలకలగూడ ఏకశిలా మెడికల్ హాల్ వద్ద..ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ ఘర్షణలో ఓ యువకుడిపై.. మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. సదరు వ్యక్తులు ఇద్దరు స్నేహితులు కాగా.. వారి మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది. డబ్బులకు సంబందించిన విషయంలో గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు.. అతని స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని గాంధీ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.