దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తోంది ఎన్నికల సంఘం. ఆదివారం పంజాబ్ లో ఒకే విడత, యూపీలో మూడో విడత పోలింగ్ ముగిసింది. పంజాబ్ లోని 117 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు జరిగింది.
పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలు. 63 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. పంజాబ్ ఎన్నికల్లో మొత్తం 1,304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా ముగించింది ఈసీ.
ఇటు ఉత్తరప్రదేశ్ లో మూడో దశ పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రజలు. 16 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరిగాయి.
మొత్తం 627 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు ఓటర్లు. 57 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది. మొత్తం ఏడు దశల్లో యూపీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.