తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది. అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. అయితే.. కరోనా ఎక్కువైతున్న నేపథ్యంలో అన్ని శాఖలకు నిబంధనలు ప్రకటిస్తారు. కానీ.. పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బందికి ఎలాంటి నిబంధనలు ఉండవు. ప్రజలను కరోనా నుండి కాపాడేందుకు వీరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తారు.
అయితే.. రోజువారీ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, పోలీస్, ఆర్టీసీ సిబ్బందితోపాటు సామాన్యులు సైతం వరుసగా కరోనా బారినపడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొవిడ్ తో ఆస్పత్రిలో చేరగా.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హోం క్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి రెండోసారి కరోనా సోకింది. ఆదిలాబాద్ జిల్లాలో డ్యూటీలో ఉన్న కండక్టర్ కు కొవిడ్ పాజిటివ్ గా తేలడంతో ప్రయాణికులంతా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్లు వీళ్లు అనే తేడాలేకుండా ప్రతీ ఒక్కరినీ వెంటాడుతోంది ఈ కరోనా.
మరోవైపు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఎస్సై, ఏఎస్సైతో పాటు మరో 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా అధికారులు అలర్ట్ అయ్యారు. మాస్క్ లేకుండా ఎవ్వరూ పోలీస్ స్టేషన్ లోకి రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు దారుడు ఒక్కరే పోలీస్ స్టేషన్ కు రావాలంటూ ఆంక్షలు విధించారు. ఇంకోవైపు భద్రాద్రి జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నుంచి ముక్కోటి విధులకు భద్రాచలం వెళ్లిన ఐదుగురు పోలీసులు కరోనా భారిన పడ్డారు.