కంప్యూటర్స్, మొబైల్స్ తయారీదారు అసుస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో చెప్పుకోదగిన గుర్తింపు పొందింది. ఆ కంపెనీ విడుదల చేసిన ఆర్‌వోజీ, జెన్‌ఫోన్ సిరీస్‌లకు చెందిన స్మార్ట్ ఫోన్లను చాలా మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. అందువల్ల ఆ సిరీస్‌లకు చెందిన ఫోన్లకు మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. అయితే త్వరలో అసుస్ జెన్‌ఫోన్ లైన్ సిరీస్‌లోనే జెన్‌ఫోన్ మినీ పేరిట మరో స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది.
2020లో మూడో త్రైమాసికంలో అసుస్ ఆశించిన స్థాయిలో లాభాలను పొందలేకపోయింది. అందుకు కరోనా కూడా ఒక కారణం. అయితే జెన్‌ఫోన్ సిరీస్‌ను మరింత విస్తృతపరచడం ద్వారా మళ్లీ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో పట్టు బిగించాలని అసుస్ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే జెన్‌ఫోన్ సిరీస్‌లో జెన్‌ఫోన్ మినీ పేరిట ఓ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను త్వరలో విడుదల చేయాలని చూస్తోంది. ఈ ఫోన్ సహాయంతో మళ్లీ మార్కెట్‌లో పై స్థానాలకు ఎగబాకాలని అసుస్ యత్నిస్తోంది.
అయితే జెన్‌ఫోన్ మినీకి చెందిన ఫీచర్లు, ఇతర సమాచారం దేన్నీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ డిస్‌ప్లే మాత్రం జెన్‌ఫోన్ 7 డిస్‌ప్లే 6.67 ఇంచుల కన్నా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కానీ యాపిల్ సంస్థ మినీ పేరిట చేసిన ప్రయోగం విఫలమైంది. తక్కువ ధరకు చిన్న డిస్‌ప్లే ఇస్తున్నామని చెప్పి ఐఫోన్ 12 మినీని విడుదల చేసింది. కానీ దానికి ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదని తెలుసుకుని త్వరలోనే ఈ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. మరి అసుస్ విడుదల చేయనున్న జెన్‌ఫోన్ మినీ సక్సెస్ అవుతుందా, లేదా అన్నది చూడాలి.
ఇక అసుస్ ఆర్‌వోజీ సిరీస్‌లో విడుదల చేయనున్న ఆర్‌వోజీ ఫోన్ 5 మార్చి, ఏప్రిల్ మధ్యలో విడుదలవుతుందని తెలుస్తోంది. దీనికి ఇప్పటికే ఎంఐఐటీ, టీఈఎన్ఏఏల నుంచి ధ్రువీకరణ లభించింది. అందులో 6.78 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు స్నాప్ డ్రాగన్ నూతన ప్రాసెసర్ 888 ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.