బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కీలకమైన, చివరిదైన నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి కూడా అడుగుపెట్టింది. అయితే నాలుగో టెస్ట్ చివరిరోజు అయిన అయిదో రోజులో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక ఆ సంఘటనలు చూసి టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ ట్వీట్ చేశాడు. నేను బౌలింగ్ మానేయాలా? అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు.
అహ్మదాబాద్ వేదికగా ఇండియా-ఆసిస్ మధ్య చివరిదైన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది.ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాటర్లు తమ బ్యాట్ లకు పని చెప్పారు. దాంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. అయితే గత మూడు టెస్ట్ ల మాదిరిగానే ఈ టెస్ట్ లో సైతం వికెట్ల పండగ జరుగుతుందని అందరు భావించారు. కానీ అలా జరగలేదు. ఇక మూడు రోజుల ఆట ముగిసేసరికి ఈ మ్యాచ్ డ్రా అవుతుందని అందరికి అర్ధం అయ్యింది. దాంతో ఐదో రోజు ప్రయోగాల బాట పట్టాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.
ఎప్పుడూ బ్యాటింగ్ చేస్తూ.. కనిపించే పుజారాతో బౌలింగ్ చేయించడం, అలాగే యంగ్ ప్లేయర్ గిల్ తో కూడా బౌలింగ్ చేయించాడు రోహిత్. వీరిద్దరి చేత చెరో ఓవర్ వేయించాడు రోహిత్. ఒక ఓవర్ వేసిన పుజారా ఒక రన్ ఇవ్వగా.. గిల్ సైతం ఒకేఒక్క పరుగు ఇచ్చాడు. అయితే మ్యాచ్ ఫలితాలు ముందుగానే తెలిసినప్పుడు కెప్టెన్స్ ఇలా ప్రయోగాలు చేస్తుంటారు. ఇక పుజారా బౌలింగ్ చేయడంపై ఫన్నీగా స్పందించాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.
పుజారా బౌలింగ్ చేస్తున్న ఫోటోను తన ట్వీటర్ ఖాతాలో షేర్ చేస్తూ..”నువ్వు బౌలింగ్ చేస్తే.. నేనేం చెయ్యాలి? బౌలింగ్ మానేయాలా?” అంటూ చమత్కరించాడు. ఇక అశ్విన్ అప్పుడప్పుడు ఇలా తనదైన స్టైల్లో సోషల్ మీడియా వేదికగా చమత్కారాలు విసురుతూనే ఉంటాడు. దాంతో ఈ ట్వీట్ పై క్రికెట్ అభిమానులు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.