బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని ఢాకాకు వెళ్తున్న బస్సు ఒకటి మదిరాపూర్ వద్ద అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రయాణికులతో కూడిన బస్పు ఒకటి ఢాకాకు వెళుతోంది. పద్మా బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు మీదుగా వెళుతున్న బస్సు మదారిపూర్ లోని శిబ్ చార్ ఉప జిల్లాలోని కుతుబ్ పూర్ ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకు పోయింది.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు స్థానిక ప్రజలతో కలిసి సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బస్సు చక్రం విరిగి పోయిందని,ఈ క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ కమిటీ నియమించనున్నట్టు మదారీ పూర్ డిప్యూటీ కమిషనర్ రహీమా ఖాతూన్ తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.