అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పలు కలకలం సృష్టించాయి. ఉత్తర మేరీల్యాండ్ లోని మెషిన్ తయారీ కంపెనీలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలను కోల్పోయారు. మరొకరు గాయపడినట్టు అధికారులు తెలిపారు. అనంతరం భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో దుండగుడు గాయపడగా ఓ పోలీసుకు గాయాలయ్యాయి.
మేరీలాండ్ గవర్నర్ లారీ హోగన్ మాట్లాడుతూ…. కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించినట్టు తెలిపారు. ఘటన సమయంలో కంపెనీలో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారనేది తెలియాల్సి ఉందన్నారు.
పోలీసు కాల్పుల్లో గాయపడిన దుండగునికి స్థానిక ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత వారం కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకున్నది. టెక్సాస్ లోని ఓ స్కూల్ లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మొత్తం 21 మంది మరణించారు.