ఏపీలో టీడీపీ అధ్యక్షుడిని మార్చే యోచనలో జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా నున్న కళా వెంకట్ రావును తప్పించి అదే ఉత్తరాంధ్రకు చెందిన మరో నేతకు బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు అనుకుంటున్నారని సమాచారం. ఏపీ సర్కారు తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తనతో సమానంగా తిప్పికొట్టగల నేతకు ఆ బాధ్యతలను అప్పగించాలని టీడీపీ బాస్ యోచిస్తున్నారు. అయితే అసెంబ్లీలో తనకు అండగా నిలబడుతూ…. టీడీపీలో కీలక నేతగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు చంద్రబాబు నిర్ణయించారని తెలుస్తోంది. అయితే అచ్చెన్నాయుడుకి పోటీగా ఆయనతో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అచ్చెన్నాయుడుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ గాలి వీచినా పోటీని తట్టుకొని.. అచ్చెన్నాయుడు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉత్తరాంధ్ర వాసి, బీసీ సామాజికవర్గానికి చెందిన కళా వెంకట్రావు స్థానంలో మరో ఉత్తరాంధ్ర వాసి, బీసీ అయిన అచ్చెన్నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు ఎక్కువని తెలుస్తోంది.