గత కొద్ది కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో విపక్షాలు భగ్గుమంటునే ఉన్నాయి. అమరావతి ఒక్కటే రాజధాని అని మొదటి నుంచి చెబుతున్నాయి. తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ విశాఖపట్నంలో గర్జన సభ ఏర్పాటు చేస్తుండడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. నాడు ఐదు కోట్ల మంది ఆకాంక్షలకు అనుగుణంగా నిండు సభలో సుదీర్ఘ సమయం పాటు చర్చించి, అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ ఈనాడు అమరావతితో అభివృద్ధి జరగదని, అన్ని ప్రాంతాల నుంచి డబ్బు తెచ్చి అమరావతిలో ఖర్చు చేస్తారని పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
టీడీపీ హయాంలో ఓ ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లామని పేర్కొన్నారు. తిరుపతిలో హార్డ్ వేర్ హబ్, ఎలక్ట్రానిక్ హబ్ స్థాపించామని తెలిపారు. ఇదేదో నేను అబద్ధం చెప్పడం కాదు… మీ వద్ద రికార్డులు ఉన్నాయి కదా! ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు వచ్చాయి? నువ్వే చెప్పు అంటూ సీఎంని ప్రశ్నించారు.
సొంత రాష్ట్రంలోని సంస్థలకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వాటిని ఎండగడుతోంది నువ్వు. కేంద్రం ఇచ్చిన నిధులన్నింటిని పక్కదారి పట్టించావంటూ విరుచుకుపడ్డారు. ఈ విధంగా రాష్ట్రాన్ని దారుణంగా దెబ్బ తీసిన నువ్వు వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పేర్కొన్నారు.
ప్రజల్లో నీ మీద ఉన్న వ్యతిరేకతను మళ్లించడానికి వికేంద్రీకరణ అనడం దుర్మార్గం. ఇవాళ మూడు రాజధానులు అంటున్నావు… నీకేం అధికారం ఉంది? ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి అధికారం లేని ఒక అంశాన్ని మళ్లీ ప్రజలపై పెట్టి, కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పదని హెచ్చరించారు.
రాజధానులను మార్చే అధికారం ఏపీ అసెంబ్లీకి లేదని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పాయి. ఒకవేళ రాజధానిని మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పాయి.
ఈ విషయం జగన్ కు తెలుసో తెలియదో కానీ… నాడు విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఏమన్నాడో ఓసారి చూద్దాం! ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం, అయితే అందుకు అధికారం లేదు, రాజ్యాంగ సవరణ చేయండి అంటూ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టాడు. ఇప్పుడా బిల్లు పెట్టిన విషయాన్ని కూడా పక్కనబెట్టి మూడు రాజధానులు అంటూ మూడుముక్కలాట ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.