అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
పులిచింతల గేటు ఊడిపోవడానికి చంద్రబాబు కారణమని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పడం దిగజారుడుతనానికి నిదర్శనం. 90 శాతం పనులు రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగాయంటూనే చంద్రబాబుపై నెపం నెట్టి తప్పించుకోవాలనుకోవడం సిగ్గుచేటు. ఒలింపిక్స్ లో బురద జల్లే క్రీడ పెడితే వైసీపీ నేతలు దేశానికి అత్యధిక గోల్డ్ మెడల్స్ తెచ్చేవారు.
పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగినా.. పులివెందుల జగన్ రెడ్డి ఇంటి గేటు విరిగినా దానికి చంద్రబాబే కారణమని బురద జల్లడం వైసీపీ నాయకులకు పరిపాటిగా మారింది. వైఎస్ కుటుంబం జలయజ్ఞం పేరుతో చేసిన ధనయజ్ఞం వల్ల.. నేడు రాష్ట్రంలోని ప్రాజెక్టుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మత్తులు, నిర్వహణ, పర్యవేక్షణకు చేసిన వ్యయం శూన్యం. ఏసీ రూముల్లో సమీక్షల పేరుతో కాలయాపన చేయడం తప్ప ప్రాజెక్టులను సందర్శించిన పాపాన పోలేదు.
పులిచింతల పూర్తి చేసిన ఘనత వైఎస్ ది అని అక్కడ 45 అడుగుల విగ్రహంతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 07, 2019న మంత్రి అనిల్ ప్రకటించారు. జగన్ రెడ్డి కూడా ఆ ఘనత తమదే అంటూ విజయవాడలో రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.