aవిశాఖ: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలోకి క్రిమినల్స్ వచ్చి చేరారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. సీబీఐ కేసులు, నేరచరిత్ర కలిగిన ముద్దాయిలను టీటీడీ బోర్టు సభ్యులుగా నియమించారని విశాఖలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల పవిత్రతను ప్రభుత్వం మంటగలిపిందని అన్నారు. శేఖర్‌రెడ్డి దగ్గర లోకేష్ వంద కోట్లు తీసుకుని బోర్డు మెంబర్‌గా నియమించారని విజయసాయిరెడ్డి గతంలో ఆరోపించారని గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఎన్ని కోట్లు తీసుకుని అదే శేఖర్‌రెడ్డికి అదే టీటీడీలో అదే పదవి ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పచ్చ డైమండ్ తిరుమలలో లేదని జేఈవో ధర్మారెడ్డి మీడియాకు చెప్పారని, ఆ డైమండ్ గురించి గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన వారిపై సుమోటాగా కేసు నమోదు చేయాలని కోరారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసినందుకు భక్తులకు, చంద్రబాబుకి జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. 4 నెలల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను విమర్శించినందుకు అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేశారని, మరి గతంలో జగన్, ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినా కూడా తాము కేసులు కట్టలేదని అన్నారు. పీపీఏల రద్దు వల్ల గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు.