విశాఖ: అవగాహన లేని దుర్మార్గపు వ్యక్తి సీఎం కావడం దురదృష్టకరమని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చి అశుభంతో జగన్ పాలన ప్రారంభించారని ఇసుక ర్యాలీ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. ప్రజలు వరద కష్టాల్లో ఉంటే జగనేమో విదేశీ పర్యటనలు చేశారని దుమ్మెత్తిపోశారు. ఒక్క అవకాశం ఇద్దామనుకున్న ప్రజల నమ్మకాన్ని జగన్ వమ్ము చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమెంట్ కంపెనీలతో కమిషన్ కుదరకపోవటంతోనే ఇసుక కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపించారు. ఇసుక టెండర్ల పేరుతో వైసీపీ నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఇసుక కొరత వల్ల 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ద్వారా 900 కోట్లు ఆదాయం వచ్చేదన్నారు. చంద్రబాబు ప్రజలకు ఉచిత ఇసుక ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రెండు వేలు ఉంటే.. ఇప్పుడేమో 10 వేలు అయిందన్నారు. మిగతా 8 వేలు ఏ పంది కొక్కులు తింటున్నాయని ఫైరయ్యారు. పోలవరంపై కోర్టు మందలించినా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందన్నారు. రాజధాని అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంగా చెప్పుకొచ్చారు. రాజధానిలో టీడీపీ నేతలకు భూములున్నాయని ఆరోపించడం కాదన్నారు. ప్రభుత్వంలో ఉండి గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒకవేళ టీడీపీ నేతలకు భూములుంటే ఆ వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.