టెక్నాలజీ పుణ్యమా అని ఆన్లైన్ లావాదేవీలు బాగా పెరిగిపోయాయి. ఏ పని చేయాలన్నా ఆన్లైన్ లోనే జరుగుతోంది నేడు. అయితే ఇది సురక్షితం కాదు అని మొత్తుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతోకొంత ప్రమాదం ఉన్నప్పటికీ కూర్చున్న దగ్గరే పనులు అయిపోతుంటే ఎవరు మాత్రం ఆన్లైన్ చెల్లింపుల వైపు మొగ్గు చూపకుండా ఉంటారు. అయితే ఈ విధానంలో ఎంత ఉపయోగం ఉందో అంతే ప్రమాదం కూడా ఉంది. సరైన అవగాహన లేకపోతే మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇదే విషయాన్నీ తాజాగా ఆర్‌బిఐ కూడా వెల్లడించింది.
బ్యాంక్ కస్టమలు ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం (సెప్టెంబర్ 13) హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల కాలంలో సెంట్రల్ బ్యాంక్ KYC అప్‌డేట్ పేరుతో చాలా మంది బ్యాంక్ కస్టమర్లను మోసం చేస్తున్నట్లు చాలా ఫిర్యాదులు అందాయి. ఈ నేసథ్యంలో లింక్‌ను పంపి KYC అప్‌డేట్ కోసం యాప్‌ని ఇన్‌స్టాల్ చేయమని కొంతమంది మోసగాళ్లు కస్టమర్‌లను అడగవచ్చని తెలిపింది. ఖాతాదారులు తమ ఖాతా లాగిన్ వివరాలు వ్యక్తిగత సమాచారం, KYC జిరాక్స్ కాపీ, కార్డ్ వివరాలు, పిన్, పాస్‌వర్డ్, OTP మొదలైనవి తెలియని వ్యక్తులు లేదా ఏజెన్సీలతో పంచుకోవద్దని సెంట్రల్ బ్యాంక్ సూచించింది.
కాబట్టి మోసగాళ్ల చేత మోసపోకుండా జాగ్రత్త వహించండి. ఇప్పటికే తరచుగా ఇలా డబ్బులు పోగొట్టుకుంటున్న సైబర్ క్రైమ్ కేసులను రోజూ చూస్తూనే ఉన్నాము. అందుకే ఆన్లైన్ లావాదేవీలు జరిపేటప్పుడు జాగత్తగా ఉండడం మంచిది.