2015కు ముందు దేశ ప్రజలు అట్ కీ, లట్ కీ, భట్ కీ పథకాలు, బంధుప్రీతి, కుంభకోణాల గురించి మాట్లాడుకునే వారని అన్నారు ప్రధాని మోడీ. కానీ.. ఇప్పుడు సంక్షేమ పథకాలు, వాటి వల్ల కలుగుతున్న ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారని తెలిపారు.
ప్రధాని మంగళవారం సిమ్లాలో పర్యటించారు. గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్నలబ్దిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
2015కు ముందు దేశాన్ని పాలించిన పార్టీలు అవినీతిని వ్యవస్థలో ఓ భాగంగా పరిగణించే వారని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అప్పటి ప్రభుత్వాలు దానికి లొంగిపోయాయని విమర్శించారు. అందువల్ల ప్రజలకు రావాల్సిన పథకాల నిధులు లూఠీ అవుతుంటే సమాజం చూస్తూ ఉండిపోయిందన్నారు.
ఈ ఎనిమిదేండ్లలో తనను తాను ఎప్పుడూ ఓ ప్రధానిలాగా ఊహించుకోలేదని.. కేవలం ఫైల్స్ పై సంతకాలు చేసేటప్పుడు మాత్రమే తనను ప్రధానిగా భావించేవాడినని, ఆ తర్వాత ఆ విషయం మరిచిపోయేవాడినని వివరించారు.
తాను ప్రధాన మంత్రిని కాదని 130 కోట్ల జనాభాకు ప్రధాన సేవకుడినని తెలిపారు. ఇప్పుడు భారత్ బలమైన శక్తిగా ఉందన్నారు. దేశం ఇప్పుడు బలవంతం చేస్తే స్నేహ హస్తం చాచదని, కేవలం సహాయం చేసేందుకు మాత్రమే హస్తాన్ని చాచుతుందని పేర్కొన్నారు మోడీ.