ఒక భాషలో బోల్తాకొట్టినా మరో లాంగ్వెజ్‌లో హిట్టవ్వచ్చు. ఆ భాషా, ఈ భాషాతో కాస్టింగ్ నింపేస్తే నేటివిటీ ఫీలింగ్స్ కూడా వుండవు. ఇదీ ఇప్పటి సినిమాల నయా స్ట్రాటజీ. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడంతో పాటు హిందీలో చేస్తుండటంలో టార్గెట్ ఇదే. బాహుబలి, తరువాత సాహో, ఇప్పుడు సైరా. ఇదే బాటలో ఇంకెందరు నడుస్తారో కానీ, అల్లు అర్జున్ మాత్రం ఇప్పటికే ఓ డెసిషన్ తీసేసుకున్నాడని వార్త. ఎప్పటినుంచో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం తీయాలనుకుంటున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా అట్లీ కాంబినేషన్ ఒకటి వర్కవుట్ చేస్తున్నాడని టాక్!
తాజాగా అల్లు అర్జున్‌కు సంబంధించిన మరో ఇన్ఫో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్లు తాజా సమాచారం. నెట్లో ఈ వార్త బాగా తిరుగుతోంది. అట్లీని బన్నీ కలిశాడని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా ఉంటుందని దాని సారాంశం. ఎప్పటినుంచో ద్విభాషా చిత్రం చేయాలని భావిస్తోన్నఅల్లు వారి అబ్బాయి ఈ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో డైరెక్టుగా ఎంటరవ్వాలని ప్రయత్నం. ఇప్పటికే అల్లు అర్జున్‌కు తమిళనాట బాగా క్రేజ్ వుంది. తన సినిమాలు చాలా వరకు దక్షిణాదిలో డబ్ అవుతుంటాయి. అట్లీకి తమిళనాడులోనే కాదు, తెలుగులో కూడా మంచి డైరెక్టర్ అనే ముద్ర వుంది. తమిళ సూపర్‌స్టార్ విజయ్‌కు అట్లీ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. స్టైలిష్ స్టార్ మంచి డైరెక్టర్‌తో రెండు భాషల్లో మూవీ చేస్తుండటం మెగాభిమానులకు సంతోషకరమైన సమాచారమే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం మెగా కుటుంబాభిమానులు ఏడాదిపైగా ఎదురు చూస్తున్నారు. మేకప్‌కు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ హీరో ఒకేసారి మూడు చిత్రాలకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న బన్నీ…తరువాత సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తాడు. సుకుమార్-బన్నీ కాంబినేషన్ సూపర్ హిట్ అనేది ఇప్పటికే ప్రూవ్డ్ మేటర్.