ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. కీచకులకు శిక్షలు అమలు చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. గత కొన్ని రోజులుగా ఏపీలో బాలికలు, మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలు, అఘాయిత్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. బాపట్ల రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. భర్త, పిల్లలు పక్కన ఉండగానే, ఆమెను బలవంతంగా పక్కకు లాక్కెళ్లి కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో జరిగిన నాలుగో ఘటన ఇది. తెనాలి నుంచి ట్రైన్ లో రాత్రి 11 గంటలకు రేపల్లెకి భర్త ముగ్గురు పిల్లలతో బాధిత మహిళ చేరుకున్నారు. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నాగాయలంకకు కూలి పనుల కోసం కుటుంబంతో వెళ్తున్న బాధితురాలు.. అర్ధరాత్రి కావడంతో రైల్వే స్టేషన్ ప్లాట్ పారం పైనే కుటుంబంతో నిద్రించారు.
అర్ధరాత్రి 12:00 గంటల తర్వాత ముగ్గురు వ్యక్తులు నిద్రిస్తున్న మహిళను బలవంతంగా ప్లాట్ ఫారమ్ చివరకు లాక్కెళ్లారు. అడ్డుకోబోయిన భర్తపై నిందితులు దాడికి పాల్పడి అతడ్ని కొట్టారు. మహిళ ప్రతిఘటించడంతో దాడి చేసి ఆమెను సైతం గాయపరిచిన కామాంధులు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్లో మాట్లాడారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ లో ఏమైనా ఆధారాలు లభిస్తాయేమోనని పరిశీలిస్తున్నారు.
మహిళపై జరిగిన ఆఘాయిత్యానికి నిరసనగా బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వాసుపత్రి వద్ద టీడీపీ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ అసమర్థత వల్లే మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఆందోళన కారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.