హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పదిహేడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు స్నేహితులతో కలిసి అమ్నేసియా పబ్ కు వచ్చిన బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పుడా ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.
మే 28న జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ కు బాలిక తన ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చింది. పబ్ లో వారితో కలిసి విందులో పాల్గొంది. పబ్ నుంచి బయటకు వచ్చిన బాలికను ఇంటివద్ద డ్రాప్ చేస్తామంటూ కారులో ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు కారు ఎక్కారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితులు.. కారులోనే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు కేకలు వేయడంతో ఆమెను పబ్ ఆవరణలో వదిలివెళ్లారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బాలిక మెడపై ఉన్న గాయాలను గమనించిన తల్లిదండ్రులు.. ఏం జరిగిందని నిలదీశారు. భయపడ్డ బాలిక కొందరు యువకులు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి.. జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశారు. నిందితులపై అసభ్య ప్రవర్తన కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన భరోసా కేంద్రం అధికారులు.. బాలికపై అత్యాచారం జరిగినట్లు తేల్చారు. దీంతో నిందితులపై పోక్సో చట్టం.. ఐపీసీ 323, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు 4 పోలీస్ బృందాలను రంగంలోకి దింపారు. బాలికపై అత్యాచారం తర్వాత నిందితులు గోవా పారిపోయినట్లు అందిన సమాచారంతో ఒక బృందాన్ని గోవాకు పంపినట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
బాలికపై లైంగికదాడి కేసులో.. ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కాగా.. నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ కేసులో తెరపైకి వచ్చిన ప్రజాప్రతినిధి కొడుకుకు ఎలాంటి ప్రమేయం లేదని పోలీసులు చెప్తున్నారు. ఎవరి ప్రమేయం ఉన్నా విచారణలో తేలుతుందని.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.