జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన మరవక ముందే.. మరో ఘటన వెలుగు చూసింది. చందనగర్ కు చెందిన మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే.. పాపిరెడ్డి కాలనీకి చెందిన అరవింద్.. చందానగర్ కు చెందిన మైనర్ బాలికను ప్రేమించాలని వేధింపులకు గురిచేసే వాడు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో తన పాఠశాలకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తన స్నేహితులతో కలిసి వేధించేవాడు.
ఆ సమయంలో ఫోటోలు తీసి.. తరుచూ బ్లాక్ మెయిల్ చేసే వాడు. ఈ నేపథ్యంలో ట్యూషన్ కు వెళ్లి వస్తున్న దళిత బాలికపై అరవింద్ తన స్నేహితులతో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డట్టు బాధితురాలి తల్లిదండ్రులు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులపై.. సైబరాబాద్ పోలీసులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.
గత వారం క్రితం పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ జోక్యం చేసుకున్నారని.. కేసును విత్ డ్రా చేసుకోవాలని ఎస్ఐ శ్రీనివాసులు తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు బాధితులు. పిర్యాదు చేసి వారం గడుస్తున్నప్పటికీ.. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయకుండా.. నిందితుడిపై 11 రెడ్ విత్ 12, 436, 354, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పోలీసుల తీరును ప్రశ్నించినందుకు బాలిక తండ్రిపై ఎస్సై శ్రీనివాసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఇష్టంతోనే అత్యాచారం చేశారని.. కేసు వాపసు తీసుకోకుపోతే ప్రాణాలు పోతాయని బెదిరింపులకు గురిచేస్తున్నారని కంటనీరుపెట్టుకున్నారు. నిందితుడు అరవింద్ గతంలో బాలిక తండ్రి బైక్ ను తగలబెట్టాడని పిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు బాధితులు.