టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ఈ సారి ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
మైనింగ్ నిబంధలనకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు జేసీ.. అయితే ఈ క్రమంలో ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కులం పేరుతో దూషించారంటూ వీరాంజనేయులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దపప్పూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
కాగా గతంలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈ తరహా కేసులు ఉన్నాయి. కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పెద్దపప్పూరు పోలీసులు గతంలోనూ ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇసుక రవాణా చేస్తుండగా కులం పేరుతో దూషించారని కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధులు ఫిర్యాదుతో కేసు పెట్టారు.
ఇదొక్కటే కాదు.. తాడిపత్రిలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలోనూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులపై కేసులు పెడుతూ వచ్చారు పోలీసులు.. ఇదంతా ప్రతిపక్షాలను వేధించాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ కేసులు పెట్టిస్తుందని జేసీ బ్రదర్స్ ఆరోపిస్తున్నారు.