ఎన్ని సంఘటనలు జరిగినా..విద్యార్థులు క్లాస్ రూంలలోనే ఆత్మహత్యలు చేసుకున్నా..కార్పొరేట్ విద్యాసంస్థల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. మార్కుల కోసం, ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తూనే ఉన్నాయి. నార్సింగి ఘటన మరక ముందే ఫీజ్ కోసం మరో దారుణానికి ఒడిగట్టింది దిల్ సుఖ్ నగర్ లోని నారాయణ జూనియర్ కళాశాల.
ఫీజు కట్టలేదని ఎగ్జామ్ హాల్ లో పరీక్ష రాస్తున్న విద్యార్థిని నుంచి హాల్ టికెట్ లాక్కొని బయట నిల్చోబెట్టాడు ప్రిన్సిపల్. అయితే 20 మంది ఫీజ్ కట్టని అబ్బాయిలతో ఆమెను ఒక్కదాన్నే నిల్చోబెట్టడంతో ఆవేదన చెందుతుంది. ఇక వివరాల్లోకి వెళితే..రిశిక గౌడ్ దిల్ సుఖ్ నగర్లోని నారాయణ జూనియర్ కాలేజ్ లో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె మొత్తం ఫీజు రూ.53 వేలు.
కాగా గతంలో రూ.34 వేలు ఫీజు కట్టగా…పుస్తకాల కోసమని అందులో నుంచి 9 వేల రూపాయలు యాజమాన్యం కట్ చేసుకుంది. అయితే ఎగ్జామ్స్ ఉండడంతో 6 వేల రూపాయలు ఫీజు కట్టగా సిబ్బంది హల్ టికెట్ ఇచ్చి పరీక్ష రాయడానికి ఆమెను అనుమతించింది. ఇలా ఉండగా.. మొత్తం ఫీజు కట్టాలని, అప్పుడే పరీక్ష రాయనిస్తామని.. ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థిని నుంచి హాల్ టికెట్ లాక్కొని ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి ఆమెను బయట నిలబెట్టించాడు.
ఇక పేరెంట్స్ కి ఫోన్ చేయడానికి కూడా రిశికను అనుమతించకుండా.. 20 మంది ఫీజ్ కట్టని అబ్బాయిలతో ఆమెను ఒక్కదాన్నే నిబెట్టించారు. దీంతో ఆమె తల్లిదండ్రులతో పాటు బీఆర్ఎస్వీ నేతలు కళాశాల ప్రిన్సిపల్ ను నిలదీశారు. కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు పాండు గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.