రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఆయన కారుపై కోడిగుడ్లు కొట్టారు.
యూత్ కాంగ్రెస్ నేతల చర్యతో రగిలిపోయిన మంచిరెడ్డి అనుచరులు.. వారిని పట్టుకుని చావబాదారు. తమ నాయకుడి వాహనాన్నే అడ్డుకుంటారా? అంటూ రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే కాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఆ సమయంలో కూడా ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ శ్రేణులపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వెంబడించి మరీ కొట్టారు.
ఆరోజు ఘటనకు నిరసనగా ఇప్పుడు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని కోడిగుడ్లు కొట్టారు. తమపై దాడి చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు. కానీ.. టీఆర్ఎస్ కార్యకర్తలు మళ్లీ వారిని కొట్టారు. బాధితుల్లో బయటి వ్యక్తులు కూడా ఉన్నారు. గుడ్లు విసిరింది తాము కాదని మొత్తుకున్నా వినకుండా చావబాదారు గులాబీ శ్రేణులు.