– జర్నలిస్టులపై ఆగని దాడులు
– మొన్న సిరిసిల్ల జిల్లాలో..
– నేడు నల్గొండ జిల్లాలో..
– రాష్ట్రంలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
– ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై దాడులు
గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక దందా ఏ రేంజ్ లో జరుగుతుందో తొలివెలుగు వరుస కథనాలు ఇస్తోంది. ఈ దందా వెనుక ఎవరున్నారో ఆధారాలతో సహా బయటపెడుతోంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా వాగులు, ఇతర నదుల్లోనూ ఇసుక మాఫియా ఆగడాలు మామూలుగా లేవు. సరైన అనుమతులు లేకుండానే ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. అదేంటని ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపైనే దాడులకు తెగబడుతున్నారు. మొన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుక దందాపై ప్రశ్నించాడనే కోపంతో ఓ విలేఖరిపై దాడికి పాల్పడింది ముఠా. తాజాగా నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. కాకపోతే ఇక్కడ దాడి చేసింది పోలీస్.
కేతేపల్లి మండల ఎస్సై అనిల్ రెడ్డి తుంగతుర్తికి చెందిన మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడ్డాడు. తనకు, బంధువుకి మధ్య చెలరేగిన గొడవలో ఇన్వాల్వ్ అయి.. మాట్లాడేందుకు పిలిచి విచక్షణారహితంగా దాడి చేశాడని సదరు జర్నలిస్ట్ చెబుతున్నాడు. బుధవారం ఉదయం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నల్గొండ హాస్పిటల్ కు తరలించారు.
కేతేపల్లి మండలంలో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై కొద్ది రోజులుగా పలు కథనాలు ఇచ్చాడు జర్నలిస్ట్. దాన్ని జీర్ణించుకోలేక.. ఎమ్మెల్యే దాడి చేయించారని బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి గొడవను అడ్డుగా పెట్టుకుని ఇంత దారుణంగా కొడతారా? అంటూ ఎస్సైపై మండిపడుతున్నారు.
ఈ ఘటనపై జర్నలిస్ట్ సంఘాలు భగ్గుమంటున్నాయి. నిజాలు వెలికితీసే జర్నలిస్టులపైనే దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీరినే ఇలా విచక్షణారహితంగా కొడుతున్నారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం అవుతోందని అంటున్నాయి.