– ప్రభుత్వానికి డబ్బా కొట్టడమే జర్నలిజమా?
– తప్పని చెప్తే బెదిరిస్తారా?
– ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?
– సుపారీలు ఇచ్చి చంపేస్తారా?
– ఇదేనా బంగారు తెలంగాణ?
రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎంతగా రెచ్చిపోతుందో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ పెద్దలే డైరెక్ట్ గా ఇందులో చక్రం తిప్పుతున్నారు. ఈ విషయంపై తొలివెలుగు వరుస కథనాలు ఇస్తోంది. ఇక గంజాయి మాఫియా సరేసరి. రాష్ట్రంలో స్కూళ్ల వరకు డ్రగ్స్, గంజాయి దందా చేరిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాల్లో చాలా విషయాలు బయటకు రాకుండా మేనేజ్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా రాకుండా చూసుకుంటున్నారు. కానీ.. కొందరు జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెస్తున్నారు.
అయితే.. తమ విషయాలే బయటపెడతావా అంటూ జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నాయి మాఫియా ముఠాలు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ విలేకరిపై దాడి జరిగింది. ఓ హోటల్ నిర్వాహకుడు దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపూర్ గ్రామానికి చెందిన దుర్గం విజయ్ బాబు(33) అనే జర్నలిస్ట్ విధి నిర్వహణలో భాగంగా ఓ వార్తను కవర్ చేసేందుకు వెళ్లాడు. అయితే.. మల్యాల సాయి అనే వ్యక్తి అతని వద్దకు వచ్చి అకారణంగా తిడుతూ ఇనుపరాడ్ తో తలపై మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న విజయ్ బాబుని స్థానికులు సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. తనపై దాడి సమయంలో బాలన్నతో ఫోన్ మాట్లాడు అని దాడి చేసిన వ్యక్తి చెప్పాడట. ఇసుక మాఫియా, గంజాయి మాఫియా రెచ్చిపోతున్నాయని.. తనను చంపేందుకు సుపారీ ఇచ్చినట్లుగా తెలుస్తోందని అంటున్నాడు విజయ్ బాబు. ఈ విషయాన్నే పోలీసులకు వివరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.