కర్ణాటకలో ఓ చర్చిపై దాడి జరిగింది. మైసూర్‌లోని సెయింట్ మేరీస్ చర్చిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. చర్చిలోని బేబీ జీసస్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో పాటు చర్చిలోని ఇతర సామగ్రిని కూడా ధ్వంసం చేశారు.
ఆ తర్వాత చర్చిలోని కొన్ని వస్తువులను, హుండిని సైతం దుండగులు ఎత్తుకెళ్లి పోయారు. అనంతరం వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. క్రిస్మస్ వేడుకలు జరిగిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. క్రిస్మస్ విహార యాత్రకు వెళ్లిన చర్చి ఉద్యోగి మంగళవారం చర్చికి వచ్చాడు.
మంగళవారం సాయంత్రం 6గంటలకు వచ్చి చూడగా ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారాన్ని ఫాస్టర్ కు చర్చి ఉద్యోగి అందించాడు. దీంతో పోలీసులకు చర్చి పాస్టర్ ఫాదర్ జాన్ పాల్ ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
దుండగులను గుర్తించేందుకు గాను చర్చి ప్రాంగణంలోని సీసీటీవీ పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. గత కొంతకాలంగా బలవంతపు మతమార్పిళ్ల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మిషనరీలు, చర్చిలపై దాడులు జరుగుతున్నాయి.