ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారని, దీని మౌలిక వ్యవస్థపైనే ఎటాక్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నామీద గూఢచర్యం నిర్వహించడానికి ప్రభుత్వం పెగాసస్ ను వినియోగించుకుందన్నారు. బ్రిటన్ లో కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ విజిటింగ్ ఫెలోగా ఈ దేశాన్ని సందర్శించిన ఆయన.. ’21 వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్’ అనే అంశంపై ఎంబీఏ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. తన ఫోన్ లోకి పెగాసస్ ని జొప్పించారని, చాలామంది రాజకీయ నేతల ఫోన్లపైనా నిఘా పెట్టారని రాహుల్ తెలిపారు.
దీనిపై కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు తనకు ఫోన్ చేసి తనను అప్రమత్తం చేశారని, కొన్నేళ్లుగా తాము ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. విపక్ష నేతలందరిపైనా నిఘా కొనసాగిందన్నారు. క్రిమినల్ చట్టాల పరిధిలోకి రాని ఎన్నో అంశాల ఆధారంగా తనపై కేసులు పెట్టారని అన్నారు. ప్రభుత్వం మీడియాను, జుడీషియరీని తన అదుపులోకి తీసుకుందని, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని, అసంతృప్తిని ప్రకటించినవారి నోళ్లను మూయించివేస్తోందని రాహుల్ దుయ్యబట్టారు.
ప్రధాని మోడీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పూర్తి ప్రసంగ పాఠాన్ని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వీడియోగా అప్ లోడ్ చేసింది.
దీనిపై స్పందించిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. రాహుల్ మైండ్ లో ఇప్పటికీ పెగాసస్ నలుగుతోందని, విదేశీ గడ్డపై ఆయన మళ్ళీ పెడబొబ్బలు పెడుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోడీ గురించి ఇటలీ ప్రధాని ఏం మాట్లాడారో రాహుల్ వినాలని అన్నారు. నిన్న ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. పెగాసస్ పై సుప్రీంకోర్టు తీర్పును రాహుల్ గుర్తు చేసుకోవాలని బీజేపీకే చెందిన మరో నేత షెహ్ జాద్ పూనావాలా కోరారు. రాహుల్ ని ఆయన సీరియల్ అఫెండర్ గా అభివర్ణించారు. రాహుల్ అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.