గోవాలో ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ కుటుంబంపై జరిగిన దాడి ఘటన మరువక ముందే తాజాగా మరో అమానుషం జరిగింది. నెదర్లాండ్స్ కి చెందిన ఓ మహిళా టూరిస్టుపై ఓ హోటల్ లో బార్ టెండర్ గా పని చేస్తున్న వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెపై కత్తితో ఎటాక్ చేశాడు.
ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఉత్తరాఖండ్ కి చెందిన ఇతడిని అభిషేక్ వర్మగా గుర్తించారు. ఈ మహిళా టూరిస్టును రక్షించబోయిన మరో వ్యక్తి పైనా వర్మ దాడి చేశాడు.
బుధవారం రాత్రి తాను టెంట్ లో ఉండగా సుమారు 30 ఏళ్ళ వ్యక్తి వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడబోయాడని, తాను ఎదిరించడంతో కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడని బాధితురాలు తెలిపింది.
ఈమె కేకలు విని దగ్గరలో ఉన్న యురికో అనే వ్యక్తి రాగా నిందితుడు పారిపోయాడని, అంతలోనే మళ్ళీ తిరిగివచ్చి అతనిపైనా ఎటాక్ కి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అభిషేక్ వర్మను అరెస్టు చేసి.. అతని నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోవాలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విదేశీ టూరిస్టులపై దాడులు జరగడం పరిపాటైపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.