ఆస్ట్రేలియా లోని మెల్ బోర్న్ లో హిందూ ఆలయంపై ఖలిస్థాన్ వేర్పాటువాదులు దాడి చేశారు. ఇక్కడి స్వామినారాయణ్ మందిరంలోని విగ్రహాలు, వస్తువులను ధ్వంసం చేశారు. ఆలయ గోడలపై ఖలిస్తానీ నాయకుడు భింద్రన్ వాలేకి అనుకూలంగా నినాదాలు రాశారు. అంతటితో ఆగక.. ‘హిందుస్థాన్ ముర్దాబాద్’ అని, ‘ మోడీ హిట్లర్’ అని ద్వేషం వెలిగక్కుతూ స్లోగన్స్ రాసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
లోగడ 20 వేలమందికి పైగా హిందువులు, సిక్కులను ఊచకోత కోసిన భింద్రన్ వాలేని ‘అమరుడైన యోధుడు’గా అభివర్ణిస్తున్న ఖలిస్తాన్ వేర్పాటువాదుల పట్ల ఇక్కడి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. నిన్న ఉదయం తాను ఆలయానికివచ్చిన వెంటనే.. ఈ ఆలయంపై జరిగిన దాడిని, ఈ నినాదాలను చూసి భయంతో ఆలయ కమిటీకి తెలియజేశానని భక్తుడొకరు తెలిపారు.
శాంతి కాముకులైన హిందువుల పట్ల ఖలిస్తానీల ద్వేషం బట్టబయలైందన్నారు. ఈ మందిర కమిటీ ఓ స్టేట్మెంట్ ను విడుదల చేస్తూ.. ఈ దారుణంపై దిగ్భ్రాంతి చెందామని, తమకు అన్ని మతాలపట్ల ఆదరం, గౌరవం ఉన్నాయని.. కానీ ఇలాంటి దాడులను సహించలేమని పేర్కొంది.
పరమత ద్వేషం, పగతో కూడిన ఏ చర్యనైనా తాము ఖండిస్తున్నామని, ఇవి ఏ మాత్రం అంగీకారయోగ్యం కావని హిందూ కౌన్సిల్ ఆఫ్ విక్టోరియా ప్రెసిడెంట్ మకరంద్ భగవత్ అన్నారు. ఈ చర్యలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విక్టోరియా పోలీసులను కోరుతున్నట్టు ఆయన చెప్పారు. మెల్ బోర్న్ లోని హిందూ సంఘాలు కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం దృష్టికి ఈ దాడిని తీసుకువెళ్తామని ప్రకటించాయి.