– మీడియా ప్రతినిధులపై దాడి
– అక్రమంగా మట్టి తరలిస్తున్న అక్రమార్కులు
– అడ్డుకున్న జర్నలిస్టులు
– దాడికి పాల్పడిన అక్రమార్కులు
– రక్షణ లేకుండా పోయిందంటున్న జర్నలిస్టులు
– మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో ఘటన
– ఖండిస్తున్న జర్నలిస్టు సంఘాలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి సాగిన మలిదశ ఉద్యమంలో మీడియాది ఓ ప్రత్యేక పాత్ర. అనుక్షణం విద్యార్ధులు, ఉద్యోగులు అని తారాతమ్య భేదాలు లేకుండా సాగిస్తున్న ఉద్యమాలను ప్రసారాలు చేస్తూ ప్రజలను చైతన్య పరిచింది మీడియా. ఎంతో మంది యువకులకు తమ కర్తవ్యాన్ని గుర్తుచేసింది మీడియా. అలాంటి మీడియాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లేకుండాపోయింది. రోజుకో చోట అధికార పార్టీ నాయకుల ఆగడాలు మీడియా చానల్స్ పైన, మీడియా ప్రతినిధుల పైన కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటీవల మీడియా కవరేజీకి వెళ్లిన తొలివెలుగు ప్రతినిధిని హైదరాబాద్ నగరంలోని ఓ పోలీసు అధికారి మెడలు పట్టి నెట్టేసిన విషయం మరవకముందే.. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో మరో రిపోర్టర్ పై కొందరు అధికార పార్టీ నాయకులు కాలర్ పట్టుకోవడంతో ప్రజాస్వామ్యం బతికి ఉందా అని ప్రశ్నిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. అధికార పార్టీ అండతో చేస్తున్న అక్రమాలను ఎండగట్టేందుకు వెళ్లని మీడియా ప్రతినిధులపై దుర్మార్గులు చేస్తున్న దాడులతో తమకు రక్షణ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని తొర్రూర్ మండల మడిపల్లి గ్రామంలో ముత్యాలమ్మ కుంట నుండి అక్రమంగా నల్లరేగడి మట్టిని తరలించి ఇటుక బట్టీలకు ఉపయోగిస్తున్నట్టు అందిన సమాచారంతో.. ఘటనాస్థలికి చేరుకున్నారు కొందరు మీడియా ప్రతినిధులు. అందుకు సంబంధించిన వివరాలను వీడియో తీసుకుంటున్నారు. అది గమనించిన కేతిరెడ్డి పాపిరెడ్డి, రావుల అనిల్ రెడ్డి, నలమాస సంపత్, గడీల సాయిలు తోపాటు.. కొందరు ట్రాక్టర్ డ్రైవర్లు తమపై దాడికి దిగారని జర్నలిస్టులు.
ప్రభుత్వం అవలంభిస్తున్న అక్రమాలను ప్రసారం చేస్తున్నామనే కక్షతో కావాలనే తమ పై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో నానా బూతులు తిడుతూ.. కులం పేరుతో దుషించారని అంటున్నారు. కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లారని చెప్తున్నారు. భౌతికంగా కర్రలు, రాళ్లతో తమపై దాడికి దిగారని చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయులపై దాడి జరిగిన తీరును పలువురు ప్రజాసంఘాల నాయకులతోపాటు.. మీడియా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.