ఏపీలో థియేటర్ల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని చాలా థియేటర్లలో రూల్స్ పేర్లతో భీమ్లా నాయక్ సినిమాను నడవకుండా అడ్డుకుంటున్నారని నెటిజన్లు అంటున్నారు. పైగా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం కొన్ని థియేటర్ల దగ్గర పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కన్పించడం చర్చనీయంగా మారింది.
ఈ నేపథ్యంలో ఏపి ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై కాదు.. థియేటర్ల వ్యవస్థపై దాడి జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
థియేటర్ల వ్యవస్థ మీద దాడి చాలా కలిచివేస్తోందన్నారు. తమిళనాడు నుంచి ఎంతో కష్టపడి ఇండస్ట్రీని ఇక్కడకు తీసుకువచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి, మంత్రి నానికి కలిసి తమ బాధలు చాలా సార్లు విన్నవించామన్నారు. కరోనా నుంచి రికవరీ అవుతుండగా.. ఇప్పుడు మళ్లీ ఇలా దాడి చేయడం బాధాకరమన్నారు.
ఈ దాడితో థియేటర్ల వ్యవస్థ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎగ్జిబిటర్లు మరో వ్యాపారం చూసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను థియేటర్లకు పంపి ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడ్డారు ఎన్వీ ప్రసాద్.