మతిస్థిమితం లేదు.. పైగా వృద్ధురాలు.. కనీసం జాలి అనే పదం అతడి డిక్షనరీలో లేనట్టుంది. ఎంతో కర్కశంగా ఆమెను కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లాడు. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జరిగింది ఈ ఘటన. దీనికి సంబంధించిన వీడియోను చూసి అయ్యో పాపం అని అనుకుంటూనే.. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.
సుమారు 70 ఏళ్ల సిద్దమ్మ చాలా కాలంగా షాద్ నగర్ ఆసుపత్రి పరిసరాల్లో ఉంటోంది. ఈమెకు మతిస్థిమితం లేదు. చుట్టుపక్కల వాళ్లు జాలిపడి ఏదైనా ఇస్తే తింటోంది. లేకపోతే పస్తులే. దొరికిన దాంతో కడుపు నింపుకుంటూ బతుకు బండిని నెట్టుకొస్తున్న ఆమెను పర్వేజ్ అనే యువకుడు విచక్షణా రహితంగా కొట్టాడు.
సిద్దమ్మను దారుణంగా కొడుతూ ఈడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దాన్ని చూసిన రజాక్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రజాక్ ఫ్యామిలీ అప్పుడప్పుడు ఆ వృద్ధురాలికి భోజనం పెడుతోంది.
మతి స్థిమితం లేని ఆమెపై పర్వేజ్ వ్యవహరించిన తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.