ఓ కేసు విచారణ కోసం వెళ్తున్న సమయంలో పోలీసులపై దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేయం చర్చకు దారితీస్తోంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఇటీవల జరిగిన వైన్ షాప్ దోపిడి కేసులో భాగంగా ఓ వ్యక్తిని విచారించేందుకు పోలీసులు బొమ్మలరామారం వెళ్లారు.
దీంతో బొమ్మల రామారం మండలం గద్దరాళ్ల తండాలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దోపిడీ ఘటనలో అనుమానితుడిగా ఉన్న వ్యక్తిని విచారించేందుకు శామీర్ పేట ఎస్ఐ మునీందర్, మేడ్చల్ ఎస్ఐ సత్యనారాయణ, అల్వాల్ డీఐ కిరణ్, సీసీఎస్ తండాకు వెళ్ళారు.
అయితే ఒక్కసారిగా పోలీసులు రావడంతో గుమికూడిన తండావాసులు.. వారిపై దాడికి దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న స్థానిక అధికారులు స్పందించి, దాడిలో గాయపడ్డ పోలీసులను ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే పోలీసులపై ఈ విధంగా దాడి చేయడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.