సహజంగా ఒక రాష్ట్రానికి చెందిన పోలీసులు ఇంకొక రాష్ట్రానికి వెళ్లి కేసులను విచారించడం సినిమాలో చూస్తుంటాం. కానీ.. ఇప్పుడు అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేషన్ బియ్యం ముఠాను పట్టుకోవడానికి ఏపీకి వెళ్లారు తెలంగాణ పోలీసులు. అక్కడ తెలంగాణ పోలీసులకు చుక్కెదురైంది. పోలీసులపై దాడి చేసి వారు తప్పించుకోవడమే కాకుండా.. పోలీసుల అదుపులో ఉన్న మరో నిందితున్ని తప్పించారు దుండగులు.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పోలీసులు చేస్తున్న తనిఖీల్లో భాగంగా గతేడాది నవంబరు 19న 50 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. డ్రైవర్ గంగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన బొమ్మిరెడ్డి శ్రీనివాసరావు వద్ద తాను డ్రైవర్ గా పని చేస్తానని.. సీజ్ చేసిన బియ్యాన్ని తన గోదాముకు తరలిస్తున్నట్లు గంగరాజు పేర్కొన్నాడు.
దీంతో ప్రధాన నిందితుడిగా శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసి.. స్టేషన్ కు రావాలని పలుమార్లు సమాచారమిచ్చారు గరిడేపల్లి పోలీసులు. అయినా నిందితుడి నుండి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆగ్రహించిన పోలీసులు.. అక్కడికి వెళ్లి నిందితున్ని అరెస్టు చేయాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా దాచేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు.
అందులో భాగంగానే బుధవారం రాత్రి 8.00 గంటలకు గరిడేపల్లి ఎస్‌ఐ కొమిరెడ్డి కొండల్ రెడ్డి సొంత వాహనంలో కానిస్టేబుళ్లు సైదులు, నాగేశ్వరరావుతో దాచేపల్లికి వెళ్లారు. అక్కడి ఏఎస్‌ఐ కొండల్ రావు సాయంతో గోదాముకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితున్ని గరిడేపల్లికి తరలించేందుకు కారులో కొద్దిదూరం తీసుకురాగానే నిందితుడి అన్న నాగరాజు 25 మందితో వచ్చి పోలీసుల వాహనానికి అడ్డు పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. సినీఫక్కీలో నిందితుడ్ని తప్పించి కారులో పరారయ్యారు.
ఈ దాడిలో కానిస్టేబుల్ నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి నుంచి నేరుగా దాచేపల్లి స్టేషన్ కు చేరుకున్న గరిడేపల్లి పోలీసులు.. స్థానిక స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన దాచేపల్లి పోలీసులు.. దాడికి పాల్పడిన నాగరాజుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.