సిరిసిల్లలో ఇసుక దందా ఆగడంలేదు. ఎలాంటి అనుమతులు లేకుండా యదేశ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు ఇసుకాసురులు. పట్టణంలోని నెహ్రూ నగర్ సమీపంలోగల మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పట్టణ వాసులు చెప్తున్నారు. దాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి దిగారు ఇసుక దొంగలు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మానేరు వాగు నుండి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం అందుకున్న సిరిసిల్ల టౌన్ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ ను ఘటనా స్థలికి పంపించారు. దీంతో అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్స్ ఇసుక ట్రాక్టర్ లను అడ్డుకున్నారు.
దీంతో ట్రాక్టర్ ల యజమానులు.. అదే గ్రామానికి చెందిన రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ నాయకుని పేరు చెప్తూ.. పోలీసులను నానా భూతులు తిడుతూ దాడికి దిగారు. సదరు కానిస్టేబుల్స్ ఎస్సై కి జరిగిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పారు. తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై అందరిని చెదరగొట్టారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు ప్రయత్నించారు.
దీంతో ఎలాగైనా తమ ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్న ట్రాక్టర్ యజమానులు పోలీసులను భయపెట్టాలనుకున్నారు. అనుకున్నదే పనిగా స్టేషన్ కు తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా.. అడ్డుకున్న పోలీసులను వెబ్బడించినట్టు తెలుస్తోంది.