– వర్గపోరుతో టీఆర్ఎస్ లో రోజుకో లొల్లి
– తాజాగా వికారబాద్ లో బయటపడ్డ విభేదాలు
– జెడ్పీ చైర్ పర్సన్ పై ఎమ్మెల్యే అనుచరుల దాడి
వికారాబాద్ జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కారుపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. మర్పల్లి మండలంలో ఓ మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆమె కారుపై.. కారణం చెప్పకుండానే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ను అవమానించేలా కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాడి అనంతరం ఈ ఘటనపై స్పందించిన సునీత.. ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతి చిన్న విషయాన్ని కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లొద్దనే ఇన్నాళ్లు మౌనంగా ఉండిపోయామన్నారు. కానీ.. ఇంత జరిగాక ఊరుకుంటే లాభం లేదని.. అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆనంద్ ను జిల్లా పార్టీ పదవి నుంచి తప్పించి తీరతానని శపథం చేశారు సునీతా మహేందర్ రెడ్డి.
ఎమ్మెల్యే తన వ్యవహార శైలి మార్చుకోవాలని.. ప్రోటోకాల్ ఎలా పాటించాలో తమకు తెలుసన్నారు. ప్రజల మద్దతు తమకే ఉందన్న ఆమె.. కార్యకర్తలందరూ అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. తన నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఉద్యమకారులకు నామినేటేడ్ పదవులు ఇవ్వకుండా తన చెప్పుచేతల్లో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, డాక్టర్లకు పదవులు కట్టబెడుతున్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే కావాలనే తన కారుపై దాడి చేయించారని ఆరోపించారు సునీతా రెడ్డి. గతంలో తన పేరు పక్కన చదివిన డిగ్రీలు లేవని, శిలాఫలకాలను పగులగొట్టిన చరిత్ర ఆనంద్ కుందని గుర్తు చేశారు. తన కారు అద్దాలు ద్వంసం చేశారని ఎవరినీ వదలనని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ పంచాయితీ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే తిట్టుకుంటున్నారు. ఇప్పుడు వికారాబాద్ పంచాయితీ తెరపైకి వచ్చింది.