తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. బోడుప్పల్ లో ఉన్న కార్యాలయంలోకి ఆదివారం చొరబడిన దుండగులు అసభ్య పదజాలంతో దూషిస్తూ భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారని క్యూ న్యూస్ సిబ్బంది, మల్లన్న అనుచరులు ఆరోపించారు.
ఈ ఘటనలో ఫర్నీచర్, అద్దాలు,కంప్యూటర్లు, చైర్లతో పాటు ఇతర వస్తువులు, సామాగ్రి ధ్వంసం అయ్యాయని చెప్పారు. ఇది మంత్రి మల్లారెడ్డి అనుచరుల పని అని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వార్తలు వేయొద్దంటూ దాదాపు 20 మంది దుండగులు కార్యాలయంలోకి వచ్చి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రజల గొంతుకను వినిపిస్తున్న తమపై ఇలా భౌతిక దాడులు చేయడం సరికాదంటూ మల్లన్న అనుచరులు, ఆఫీస్ సిబ్బంది రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఘటన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.