తన పంట భూమిలో వేసిన హై టెన్షన్ స్తంభాలు తొలగించాలని పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగాడు ఓ రైతు. లేదంటే తనకు చావే దిక్కు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. దీంతో జిల్లాకేంద్రంలోని సెస్ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది.
జిల్లాకు చెందిన కిషన్ అనే రైతు.. తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల తన భూమిలోనుండి హైటెన్షన్ కరెంట్ లైన్ లాగారు. తన భూమిలో నుండి లాగిన లైన్ తొలగించాలని చాలా సార్లు అధికారుల చుట్టూ తిరిగానని.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు.
తన కూతురు వివాహం కుదిరిందని..తనకున్న ఆ వ్యవసాయ భూమిని అమ్మి తన కూతురు పెళ్లి చేయాలనుకున్నానని..కానీ హైటెన్షన్ లైన్ ఉండటంతో కొనడానికి ఎవరు ముందుకు రావడంలేదని వాపోయాడు కిషన్. తన భూమిలో ఉన్న లైన్ తొలగించడానికి సెస్ ఏఈ ముప్పై వేల రూపాయలు లంచం అడిగాడని ఆరోపించాడు.
రెండు నెలలుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఏఈ మాత్ర పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వాపోయాడు. తనకు న్యాయం జరగకుంటే.. కుటుంబం అంతా పురుగుల మందు తాగి చస్తామని బెదిరించాడు. పురుగుల మందు తాగేందుకు యత్నిస్తున్న కిషన్ కార్యాలయం సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.