జిల్లాలోని జీజీహెచ్ లో హైడ్రామా నెలకొంది. సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన గార్లపాటి వెంకటేష్ కు సంబంధించి మెడికల్ రిపోర్టును తారుమారు చేసేందుకు పోలీసు పెద్దలు, ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు యత్నించారు. జీజీహెచ్‌లో వెంకేటష్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో భాగంగా సీఐడీ పోలీసులు కొట్టడంతో వెంకటేష్ గాయపడ్డాడు.
వెంకటేష్ కు ఎముక విరిగినట్లు వైద్య పరిక్షల్లో వెల్లడైంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసు పెద్దలు, పలు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు.. సీఐడీకి అనుకూలంగా రిపోర్ట్ తయారు చేయించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. దీనిపై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులకు జీజీహెచ్ కేసులలో ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా… ధరణికోటలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్న గార్లపాటి వెంకటేష్ ను సీఐడీ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబ్ చానల్ ను నడుపుతున్న వెంకటేష్.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారంటూ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
గోడదూకి మరీ ఇంట్లోకి ప్రవేశించిన సీఐడీ పోలీసులు.. ఇంటి గడియ పగులగొట్టి లోపలకు వచ్చారు. మొత్తం దృశ్యాలను వీడియో తీస్తుండడంతో పోలీసులు లైట్లు పగులగొట్టారు. వెంకటేష్ ను అరెస్ట్ చేసి.. కంప్యూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.