కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా హర్యానా, ఢిల్లీలలో రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. హర్యానా నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ బాట పట్టారు. అయితే ఢిల్లీ చుట్టూ పోలీసులు రహదారులను బ్లాక్ చేసి రైతులను అడ్డుకోవడంతో ఆందోళనల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్‌లను ప్రయోగించారు. అయితే ఆ ఆందోళనల్లో ఓ యువ రైతు చేసిన పని అందరినీ ఆకట్టుకుంది.
రహదారులపై చేరిన రైతుల మీదకు వాటర్ క్యానన్లు ప్రయోగిస్తున్న పోలీసులను అడ్డుకునేందుకు హర్యానాకు చెందిన 26 ఏళ్ల యువ రైతు నవదీప్ సింగ్ వాటర్ క్యానన్ వాహనంపైకి ఎక్కి అక్కడ నీటి సరఫరాను ఆపివేశాడు. అనంతరం అటుగా వచ్చిన రైతులకు చెందిన ట్రాక్టర్‌లో దూకాడు. ఈ సంఘటనను కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
How a young farmer from Ambala Navdeep Singh braved police lathis to climb and turn off the water cannon tap and jump back on to a tractor trolley #farmersprotest pic.twitter.com/Kzr1WJggQI
— Ranjan Mistry (@mistryofficial) November 27, 2020
అయితే ఆ పనిచేసినందుకు నవదీప్ సింగ్‌ను నెటిజన్లు హీరో అని కొనియాడుతున్నారు. కానీ అతను ఈ విషయంపై స్పందిస్తూ.. రైతులపై వాటర్ క్యానన్లు ప్రయోగిస్తుండడంతో వారు పడుతున్న బాధను చూడలేకే తాను ఆ పనిచేశానని తెలిపాడు. అయితే అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనల్లో పాల్గొన్నందుకు కూడా అతనిపై కేసు నమోదైంది. దీంతో అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడవచ్చని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఏమవుతుందో చూడాలి.