తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులపైన అధికారపార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు పెరుగిపోతున్నాయి. పూర్వికుల నుండి వారసత్వంగా వచ్చిన స్థలాలను అధికార పార్టీ అండతో ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతునే ఉన్నాయి. తాజాగా.. రాజంపేట మండలానికి చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు సిద్ధం అయింది.
వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన ఇట్టం నవీన్ కి సంబంధించిన పట్టాను తన ప్రమేయం లేకుండానే గ్రామ కార్యదర్శి మరో వ్యక్తి పేరుమీదకు పట్టా చేశారని ఆరోపిస్తూ.. కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తన తండ్రి పేరున ఉన్న ఇంటి రికార్డులను ఓ అధికార పార్టీ బడా నాయకుని సహాయంతో పంచాయతీ కార్యదర్శి మార్పిడి చేశారని ఆరోపించారు.1985లో ఇంటి కోసం పట్టా పంపిణీ చేశారని.. ఇప్పుడు దానిని తమకు కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై ఎన్నిసార్లు అధికారులను అడిగినా తనకు న్యాయం జరగడం లేదని వాపోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిని నవీన్ అతని భార్యను అడ్డుకున్నారు. వారిని తమ అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు.