– ప్రమాదం బారినపడి విధులకు దూరం
-సాయం చేయకపోగా ఉన్నతాధికారుల కక్ష సాధింపు
-రోడ్డుపైనే జీవనం.. రేకుల షెడ్డే నివాసం…
-కడుపు కాల్చుకుంటూ.. ఈగలు, దోమలను కొడుతూ..
-అనారోగ్యంతో 20 నెలలుగా వేతనం లేక అటెండర్ అవస్థలు
ప్రమాదం బారినపడి కాలు విరగొట్టుకుంటే.. సాయం చేయాల్సింది పోయి ఆ చిరుద్యోగి కడుపు మీద కొట్టారు ఉన్నతాధికారులు. ఎక్కువ రోజులు సెలవు పెట్టాడనే కారణంతో ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగించారు. అనారోగ్యం నుంచి కోలుకునేలోపే.. కోలుకోలేని దెబ్బ తగలడంతో చివరికి ఆ బాధితుడు ఏం చేయాలో తెలియక బిచ్చగాడి అవతారమెత్తాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ కళాశాలలో ఆఫీస్ సబార్డినేట్ (ప్రభుత్వ అటెండర్ )గా విధులు నిర్వర్తిస్తూ.. ఉన్నతాధికారుల అకారణ కోపానికి బలైన నసీరుద్దీన్ కన్నీటి గాథ ఇది.
చదివింది ఎంఎస్సీ అయినా.. అటెండర్ గా ఉద్యోగం చేస్తున్నాడు నసీరుద్దీన్. కొన్నాళ్ల క్రితం దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో కాలుకు సర్జరీ అయింది. ఈ క్రమంలోనే కొంతకాలం ఉద్యోగానికి వెళ్లలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికారులు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గత 18 నెలలుగా జీతం రాక, జేబులో రూపాయి లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నాడు. ఒక రేకుల షెడ్డులో ఉంటూ.. అనారోగ్యంతో బాధపడుతూ జీవనం సాగిస్తున్నాడు. తినడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఎవరిని పడితే వారిని యాచిస్తూ.. వారిచ్చిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నాడు.
పెద్ద స్థాయిలో ఉండే అధికారులు ఏదైనా అనారోగ్యం బారినపడితే మెడికల్ సెలవులు పెట్టి.. నిత్యం కార్యాలయాలకు సైతం సమయపాలన పాటించకుండా వెళ్ళదీస్తుంటారు. కానీ కాలుకు శస్త్ర చికిత్స జరిగి సెలవులో ఉంటే మాత్రం ఒక్కసారిగా ఈ చిరు ఉద్యోగిని అటాచ్ చేసి ఉత్తర్వులు ఇచ్చారు. తిరిగి ఆర్డర్ తెచ్చుకుందాం అంటే జేబులో చిల్లిగవ్వ లేదని నసీరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తిరిగి విధుల్లోకి చేరడానికి ప్రయత్నం చేయగా.. అధికారులు 40 వేలు లంచం డిమాండ్ చేసారని వాపోతున్నాడు. చేతిలో రూపాయి కూడా లేదని.. అధికార యంత్రాంగం స్పందించి తిరిగి తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాడు.