పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లు చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ దాని ధర ఏకంగా రూ.172 కోట్లు పలుకుతుంది. ఇంతకీ ఈ ధర దేనికంటే పింక్ డైమండ్ ది. చిన్న పక్షి సైజు కన్నా చిన్నగా ఉండే ఈ డైమండ్ ను చూడగానే కళ్లు జిగేల్ మంటున్నాయి.
ఈ వజ్రాన్ని ఫ్యాన్సీ వివిడ్ పింక్ స్టార్ అని పిలవడంలోఆశ్చర్యం లేదు. దాని కాంతి అంతలా తళుక్కుమంటోంది.. డైమండ్స్‌లో పింక్ డైమండ్స్ వేరయా అంటోంది- హాంకాంగ్‌లోని సోత్బే అనే వేలంపాట సంస్థ. సహజంగా లభించే వజ్రాల్లో పింక్ డైమండ్స్ చాలా అరుదుగా దొరుకుతుంటాయి. ఇందులో అతి చిన్నగా ఉన్నవాటిని ‘ఫ్యాన్సీ వివిడ్ పింక్’గా వర్గీకరిస్తారు.
వీటిని సానపెట్టి ఒక రూపం తెచ్చేందుకు చాలా నైపుణ్యం, శ్రమ అవసరం. గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ డైమండ్‌ను హాంకాంగ్‌లో ఈనెల ఏడో తేదీన వేలం వేస్తున్నారు. వేలం పాటలో దీనికి రూ.172 కోట్లు ధర పలకవచ్చని సోత్బే అంచనా వేస్తోంది. ఈ ఫ్యాన్సీ వివిడ్ పింక్ స్టార్ డైమండ్ 11.15 క్యారెట్లు ఉన్నట్లు చెబుతున్నారు.
టాంజానియాలో ఉన్న మ్వాదుయ్ ప్రాంతంలోని విలియంసన్ మైన్ గనుల్లో ఇది దొరికింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన వజ్రాల గని. గతంలో ఈ గనుల నుంచి వెలికి తీసిన అతి పెద్ద డైమండ్ 59.60 క్యారెట్లు ఉంది. ఈ వజ్రాన్ని 2017లో వేలం వేశారు. 10 క్యారెట్ల అతిచిన్న వజ్రం కూడా విలియంసన్ మైన్ గనుల్లోనే దొరికింది.
ఈ ‘ఫ్యాన్సీ వివిడ్ పింక్’ను మొదటిసారిగా లండన్‌లో ప్రదర్శనకు పెట్టారు. బాయ్, సింగపూర్, తైపీల మీదుగా హాంకాంగ్ తెచ్చారు. ఏడో తేదీన జరిగే వేలంలో ఆసియాకు చెందిన బిడ్డర్లు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారని సోత్బే వర్గాలు తెలిపాయి.
కాగా.. ఆఫ్రికాలో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పెద్ద గులాబీ రంగు వజ్రం లభ్యమైంది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ వజ్రం దొరికింది. ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదేనని భావిస్తామని తెలిపింది. ఈ వజ్రానికి ‘లులో రోజ్’ అని పేరు పెట్టారు.