స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

దీనిపై పది పేజీల నివేదిక ఇచ్చింది. జేఎం, ఎల్‌టీ, ఇతర రాడికల్ గ్రూపుల నుంచి ప్రమాదం పొంచి ఉందని నివేదికలో ఐబీ వెల్లడించింది.
ఈ క్రమంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఎర్రకోట వద్ద భద్రతను, నిబంధనలు మరింత కఠినం చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై జరిగిన దాడిని కూడా ఈ సందర్బంగా ప్రస్తావిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఢిల్లీ పోలీసులను ఐబీ ఆదేశించింది.
అలాగే ఇటీవల జరిగిన అమరావతి, ఉదయ్‌పూర్ ఘటనలను కూడా ఐబీ ప్రస్తావించింది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో రాడికల్ గ్రూపుల యాక్టివిటీపై పటిష్టమైన నిఘా పెట్టాలని పేర్కొంది.
యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్), పారాగ్లైడర్లను సైతం ఉగ్రవాద సంస్థలు వినియోగించే ప్రమాద ముందని ఐబీ తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లోనూ దాడులు జరిగే అవకాశాలున్నట్టు వెల్లడించింది.
అందువల్ల బీఎస్‌ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఐబీ కోరింది. ఢిల్లీలోని రోహింగ్యాలు, సూడన్, ఆఫ్ఘనిస్తాన్ వాసులు నివసిస్తున్న ప్రాంతాలపై నిఘా వేయాలని సూచించింది. టిఫిన్ బాంబులు, వీవీఈడీ, స్టిక్కీ బాంబ్ లను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలంటూ ఢిల్లీ పోలీసులకు సూచనలు చేసింది.