మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి ఆ దేశ సైనిక కోర్టు షాక్ ఇచ్చింది. ఆమెకు మరో ఏడేండ్ల జైలు శిక్షను సైనిక కోర్టు విధించింది. ఇప్పటికే ఆమెకు పలు కేసుల్లో 26 ఏండ్ల శిక్ష పడింది. తాజాగా శిక్షతో కలిపి మొత్తం జైలు శిక్ష 33 ఏండ్లకు చేరుకున్నది.
గతేడాది ఫిబ్రవరిలో ఆ దేశ సైన్యం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది. ఆ దేశ ప్రభుత్వం నుంచి అధికారాన్ని బలవంతంగా చేజిక్కిచ్చుకున్నది. ఆంగ్ సాన్ సూకీని సైన్యం హౌస్ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆమె హౌస్ అరెస్టులో ఉంటున్నారు.
ఆమెపై మొత్తం 19 అభియోగాలను సైన్యం మోపింది. ఆ అభియోగాలపై సుమారు 18 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగింది. అనంతరం ఆమెకు సైనిక కోర్టు జైలు శిక్ష విధించింది. తాజాగా సూకీపై ఉన్న ఆఖరి అయిదు కేసులపై శుక్రవారం సైనిక కోర్టులో విచారణ జరిగింది.
ఆమె అవినీతికి పాల్పడినట్లు సైనిక కోర్టు దోషిగా తేల్చింది. ఓ మంత్రికి ఆమె హెలికాప్టర్ ను అద్దెకు ఇచ్చారని, ఆ సమయంలో నియమావళిని ఆమె బాహటంగా ఉల్లంఘించారని పేర్కొంది. గతంలో 14 కేసుల్లో ఆమెను విచారించి శిక్ష విధించారు. ఇది ఇలా వుంటే సూకీని విడుదల చేయాలంటూ ఇటీవల ఐరాస భద్రతా మండలి ఓ ప్రకటనలో కోరింది.