వాలెంటైన్స్ డే రోజున ప్రధాని మోడీకి సూరత్ లోని ఆరో వర్సిటీ విద్యార్థులు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ప్రధాని మోడీపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు గాను విద్యార్థులు బంగారంతో పూత పూసిన బొకేను ప్రధానికి బహుమతిగా అందజేశారు.
బొకేలో 24 క్యారెట్ల బంగారు పూత పూసిన 151 గులాబీలు ఉన్నాయి. దేశంలో ప్రధాని మోడీ ఎన్నో అభివృద్ది పనులు చేశారని సూరత్ విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల పట్ల ఆయన భావాలు చాలా గొప్పవని వారు పేర్కొన్నారు. ప్రధాని మోడీ తమకు ఆదర్శమన్నారు.
అందుకే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున ఆయనకు బంగారు గులాబీల బొకే అందించామన్నారు. ప్రధాని మోడీ పాలనలో మన దేశం ఇతర దేశాలకు స్పూర్తిగా నిలుస్తోందన్నారు. ఆయన గౌరవానికి సూచనగా తాము ఈ పుష్ప గుచ్చాన్ని ఇచ్చామని చెప్పారు.
తమ తల్లి దండ్రులు నెల నెలా ఇచ్చే పాకెట్ మనీని దాచుకుని వాటితో ఈ గిఫ్ట్ తయారు చేయించామన్నారు. దీనిపై డిజైనర్ దీపక్ చోక్సీ మాట్లాడుతూ… ప్రధాని మోడీకి తాము గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నామని విద్యార్థులు తమతో చెప్పారన్నారు. ప్రధాని మోడీపై వారి ప్రేమను చూశాక గిఫ్ట్‌ను మరింత ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించి ఈ డిజైన్ తయారు చేశామన్నారు.