ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా అనూహ్య నిర్ణయం తీసుకుంది. క్రోనస్ ఫార్మాను కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. క్రోనస్ బోర్డు కూడా తమ ప్రతిపాదన అంగీకరించిందని, ఇరు సంస్థల పరస్పరంతో ఇది జరుగుతున్నట్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్‌కు చెందిన జనరిక్ వెటర్నిటీ ఫార్మాసూటికల్ ప్రొడక్ట్ సంస్థ అయిన క్రోనస్‌లో మెజార్టీ వాటాను(51 శాతం) రూ.450 కోట్లకు కొనుగోలు చేయనున్నట్టు ఆగస్టు 12న అరబిందో ఫార్మా ప్రకటించింది. ఈ మేరకు రూ. 10 విలువైన 95,059,963 ఈక్విటీ షేర్లను ఒక్కోదాన్ని రూ. 34.18 పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు వెల్లడించింది. కానీ 10 రోజులు కూడా తిరగకముందే.. ఏమైందో తెలియదు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
క్రోనస్ ఫార్మా కొనుగోలుతో.. పశువులకు సంబంధించి జనరిక్ ఔషధాలకు సంబంధించి గ్లోబల్ మార్కెట్‌లో 48 మిలియన్ యూస్ డాలర్ల వాణిజ్యానికి అవకాశ ఉందని అరబిందో ఫార్మా వెల్లడించింది. క్రోనస్ వద్ద మొత్తం 67 ఉత్పత్తులు ఉండగా.. ఇందులో 22 USFDA వద్ద ఫైల్ అయ్యాయి. 6 ఉత్పత్తులు ఆమోదం పొందాయి.